రాష్ట్రంలో.ఆందోళనకర స్థాయి లో.రోడ్డు ప్రమాదాలు
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.),:రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో సుమారు 18,380 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని గణాంకాలతో సహా ఆయన వివరించారు. గురువారం విజయవాడలో ఏర్
రాష్ట్రంలో.ఆందోళనకర స్థాయి లో.రోడ్డు ప్రమాదాలు


అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.),:రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025లో సుమారు 18,380 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని గణాంకాలతో సహా ఆయన వివరించారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పీఎం రాహత్ (PM RAHAT) బాధ్యుల సమావేశంలో సౌరభ్ గౌర్ మాట్లాడారు. ఈ ప్రమాదాలు అధికంగా నేషనల్ హైవే, స్టేట్ హైవే, డిస్ట్రిక్ట్ రోడ్లు, కోల్కతా-చెన్నై జాతీయ రహదారి వంటి ప్రధాన కారిడార్లలోనే జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 16 వేల కెమెరాలతో యాక్సి మానిటరింగ్ జరుగుతోందని సౌరభ్ గౌర్ చెప్పారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే స్పందించడానికి అవకాశం ఉందన్నారు. యాక్సిడెంట్ అయినపుడు స్పందించిన వారికి రివార్డ్ ఇస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. వెహికల్ నంబరుతో వాహన వివరాల ద్వారా బాధితుల కుటుంబానికి సమాచారం అందించ వచ్చునని సూచించారు. పోలీసులకు సమాచారం ఇచ్చాకే రావాలని ఏమీ లేదన్నారు.

పీఎం రాహత్ (PM RAHAT) కింద నగదు రహిత వైద్య సదుపాయం ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వివరించారు. ఏ ఆసుపత్రులు కూడా పోలీసులకు చెప్పాలి అంటూ యాక్సిడెంట్ కేసులను రిజెక్ట్ చేయకూడదని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమని గుర్తు చేశారు. యాక్సిడెంట్ చేసిన వారు పారిపోవాల్సిన పని లేదు.. అక్కడే ఉండి బాధితులకు సహకరించి.. వారిని కాపాడాలని ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి హితవు పలికారు. అలా కాపాడిన వారు యాక్సిడెంట్ చేసిన వారైనా సరే గుర్తించి, వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

బ్లాక్ స్పాట్లు, బ్లైండ్ టర్నింగ్ లు, అలాగే లైటింగ్ తక్కువ ఉన్న ప్రాంతాలు సౌరభ్ గౌర్ గుర్తించామన్నారు. టోల్ ప్లాజాల వద్ద కూడా మానిటరింగ్ ఉంటుందని తెలిపారు. వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కంపల్సరీగా ఉండాలని స్పష్టం చేశారు. 108, 112 నంబర్ల సేవలను సమన్వయ పరుస్తున్నామని చెప్పారు. 112కి కాల్ చేసినా.. 108కి కాల్ వెళ్ళేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం 79 శాతం అతివేగమేనని సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. అలాగే 3 శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఒక శాతం మద్యం సేవించి వాహనం నడపడంతోపాటు మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారి తీస్తున్నాయని తెలిపారు. ప్రమాదాల్లో అత్యధికంగా టూ-వీలర్స్, లైట్ మోటార్ వెహికల్స్, లారీలు, బస్సులు ఉన్నాయన్నారు.

ప్రతి సంవత్సరం సగటున 8 వేల మంది ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు. 20 వేల మందికిపైగా గాయపడుతున్నారని వివరించారు. సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య అధిక రద్దీ వల్ల ఈ ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల నగదు రహిత వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ప్రమాదం జరిగిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’గా పరిగణించాలని ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. ప్రతి100 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాద స్థలం నుండి 50 కిలోమీటర్ల పరిధిలోనే వైద్యం అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande