
ఒంటిమిట్ట, 16 ఏప్రిల్ (హి.స.): ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. రూ.29,00,205 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారి నవీన్ కుమార్ తెలిపారు. ఆలయంలోని రంగ, ముఖ మండపం, భక్త సంజీవరాయ స్వామి ఆలయంలో హుండీలను తెరిచి లెక్కించారు. తితిదే పరిపాలన, విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో శ్రీవారి సేవకులు లెక్కింపు చేపట్టారు. మార్చి 26 నుంచి ఈ నెల 5 వరకు శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించారు. రాములోరి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆరాధ్య దైవం జగదభిరాముడిని దర్శించిన అనంతరం భక్తులు హుండీల్లో కానుకలను వేశారు. నెల రోజుల వ్యవధిలో ఆలయానికి రూ.29 లక్షలు ఆదాయం రావడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారి అని ఆలయ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ