
మెదక్, 16 ఏప్రిల్ (హి.స.)
ప్రజాపాలన కార్యక్రమం ద్వారా
ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్దిదారులకు చేరవేయడమే మండల సభల ప్రధాన లక్ష్యమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం కొల్చారం మండలంలో నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారం చూపే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజల విజ్ఞప్తులను ప్రాధాన్యంగా తీసుకుని నిర్ణీత కాలంలో పరిష్కారం చూపాలని సూచించారు.
ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు.
మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల పెంపులో ప్రభుత్వ సహకారం కీలకమని వివరించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..