విద్యార్థినుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: వికారాబాద్ జిల్లా కలెక్టర్
విద్యార్థినుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
Collector


వికారాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)

విద్యార్థినుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. గురువారం బొంరాస్పేట్ గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను సమీక్షించారు. తరగతి గదులను పరిశీలించి బోధన విధానాన్ని అధ్యయనం చేశారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్, వారి చదువు, సౌకర్యాలు, ఆరోగ్య సమస్యలపై సమాచారం సేకరించారు. ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థినులతో మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో అనవసరంగా సెల్ఫోన్లు వినియోగించకుండా, వచ్చే ఏడాది 10వ తరగతి దృష్ట్యా ముందుగానే సిలబస్పై దృష్టి సారించి బాగా చదువుకోవాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రత, పోషకాహారం, తాగునీరు, వసతి సౌకర్యాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదని అధికారులను నిరంతర ఆదేశించారు. ఆరోగ్య పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించి, విద్యార్థినుల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. సిబ్బంది, విద్యార్థుల హాజరు నమోదు రిజిస్టర్లను పరిశీలించిన ఆయన, ఉపాధ్యాయులు విద్యార్థినుల వ్యక్తిగత అభివృద్ధి, క్రమశిక్షణ, నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande