
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (పిల్) స్టే ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేమని స్పష్టం చేస్తూ, పిటిషనర్ ఉద్దేశంపై అనుమానం వ్యక్తం చేసింది.
కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన కన్నిగంటి ఆంజనేయ ప్రసాద్ అనే రైతు, ఓఆర్ఆర్ అలైన్మెంట్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నిన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓఆర్ఆర్ ఎక్కడ నిర్మించాలో ఒక రైతు ఎలా నిర్ణయిస్తారు? అని ప్రశ్నించింది. ఇటీవల కాలంలో చాలా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు రాజకీయ దురుద్దేశాలతో దాఖలవుతున్నాయని, ఈ పిల్ కూడా నిజమైన సదుద్దేశంతోనే వేశారా? అనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని ధర్మాసనం తేల్చిచెప్పింది.
కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే, నిర్మాణ పనులు కొనసాగించుకోవచ్చని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (ఎన్హెచ్ఎఐ) స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi