
హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)
నగరంలో త్వరలో 60 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. కూకట్పల్లిలో నూతనంగా నిర్మించిన ఛార్జింగ్స్టేషన్ను ప్రారంభించిన రోజే వాటిని రోడ్డెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కూకట్పల్లి డిపోలో ప్రస్తుతం ఉన్న 60 పాత బస్సుల్లో కాలం చెల్లినవే ఉండగా వాటిని స్క్రాప్నకు పంపాలని యాజమాన్యం నిర్ణయించినట్లు డిపో మేనేజర్ డి.హరి తెలిపారు. గడువు ఉన్నవాటిని జిల్లాలకు పంపనున్నారు. ఇవి కాకుండా మరో 21 బస్సులను రెట్రోఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చనున్నారు. 240 బస్సులను రెట్రోఫిట్మెంట్ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న నేపథ్యంలో ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. డీజిల్ బస్సుల్లోంచి ఇంజిన్లు తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ల (బ్యాటరీ బస్సుల్లో ఉపయోగించేవి)ను అమర్చడం ద్వారా ఆ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా వాడుకోనున్నారు. డీజిల్ బస్సులను రెట్రోఫిట్మెంట్తో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే పరిజ్ఞానం కొన్నేళ్ల క్రితమే అందుబాటులో ఉండగా ఆర్టీసీ కూడా దీన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తోంది. కానీ అది భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో పెట్టుబడి పెట్టే సంస్థలతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. సొంత ఖర్చుతో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి ఆర్టీసికి అందించనున్నాయి. తర్వాత వడ్డీతో కలిసి సమ వాయిదాల్లో ఒప్పంద గడువు ముగిసే వరకు ఆర్టీసీ ఈ సంస్థలకు చెల్లించనుంది. అనంతరం ఈ బస్సులు ఆర్టీసీ సొంతమవుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ