
అనకాపల్లి, 18 ఏప్రిల్ (హి.స.)వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్న క్యాంటీన్లు మూసేశారని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు నాణ్యమైన భోజనం పెట్టడమే అన్న క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి అన్న క్యాంటీన్లను కూడా రద్దు చేశారని ప్రస్తావించారు. పేదలకు భోజనాన్ని దూరం చేశారని ధ్వజమెత్తారు. ఈరోజు (శనివారం) పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి అనిత పర్యటించారు. పాయకరావుపేట పట్టణంలో రూ. 61 లక్షలతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను ప్రారంభించారు.
స్థానికులతో కలిసి అనిత భోజనం చేశారు. భోజనాలు ఏలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడారు. పాయకరావుపేట పట్టణంలో అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి అడ్డరోడ్డు సమీపంలో మరో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్లకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం, పాయకరావుపేటలో సరయ్య చెరువు వద్ద స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. జలం - జీవం నినాదంతో చెత్త తొలగించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. సరయ్య చెరువును అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. సరయ్య చెరువును శుభ్రం చేసి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అధికారులను హోంమంత్రి అనిత ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్