
వరంగల్, 21 ఏప్రిల్ (హి.స.)
వరంగల్ పోలీస్ కమిషనరేట్
పరిధిలో తొలిసారిగా భారీ స్థాయిలో హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుండి తీసే నూనె) స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు సంయుక్తంగా వారిని పట్టుకున్నారు. ఈ ముఠా వద్ద నుంచి సుమారు రూ. 2 కోట్లు 50 లక్షల విలువ గల హాష్ ఆయిల్తో పాటు రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఒడిశా రాష్ట్రం మల్కానగిరి జిల్లాకు చెందిన హంటర్ సన్ను, హంటల్ సన్యాసి (23), ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లాకు చెందిన కండెల చిన్నబాబు (56), కృష్ణ హంటల్ (56) ఉన్నారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నాడు. పట్టుబడిన నిందితులందరూ పరస్పర పరిచయస్తులే. ప్రధాన నిందితుడు హంటల్ సన్ను తన స్వగ్రామంలో గంజాయి మొక్కలను పెంచుతూ, వాటిని ఇతర నిందితుల ద్వారా విక్రయించి డబ్బు సంపాదించి జల్సాలకు ఖర్చు చేసేవాడని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
గంజాయి విక్రయాల ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో, ప్రధాన నిందితుడు గంజాయి మొక్కల నుంచి హాష్ ఆయిల్ తయారు చేయడం ప్రారంభించాడని చెప్పారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న కిలో పాండు సూచనల మేరకు, మిగతా నిందితులతో కలిసి గంజాయి మొక్కలను పెంచి, పాండు తీసుకొచ్చిన ప్రత్యేక పరికరం సహాయంతో సుమారు 40 కిలోల హాష్ ఆయిల్ను తయారు చేశారు. ఇందులో 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోలను కిలో చొప్పున ప్యాకెట్లలో విభజించి, నలుగురు నిందితులు ఐదు కిలోల చొప్పున తీసుకుని ముంబైలో విక్రయించేందుకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి కోణార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం ప్రారంభించారు. వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అనుమానం రావడంతో, నిందితులు రైలులో నుంచి దిగిపోయి, మరుసటి రోజు ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ సమీపంలోని రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద హాష్ ఆయిల్ లభ్యమైంది. దీంతో నలుగురిని అరెస్టు చేసి 20 కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను పట్టుకోవడ లో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, వరంగల్ ఏసీపీ శుభం, ఏసీపీలు జితేందర్ రెడ్డి, జానీ నగ్సంహులు తదితర సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు