
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)
హైదరాబాద్లోని పురానాపూల్ శ్మశానవాటికలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దశదిన కర్మ సందర్భంగా పెట్టిన పిండాన్ని ముట్టడానికి కాకులు రాకపోవడంతో, ఓ కుటుంబం ఏకంగా ఒక కాకిని కొనుగోలు చేసి తమ ఆచారాన్ని పూర్తి చేసుకోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఎండల ప్రభావం సంప్రదాయ కార్యక్రమాలపై కూడా ఎలా పడుతోందో ఈ ఘటన అద్దం పడుతోంది.
ఇటీవల ఓ కుటుంబం పురానాపూల్ శ్మశానవాటికలో పెద్ద కర్మ కార్యక్రమం నిర్వహించింది. ఆచారం ప్రకారం పిండ ప్రదానం చేసి కాకుల కోసం గంటల తరబడి ఎదురుచూశారు. అయితే, తీవ్రమైన ఎండల కారణంగా ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించలేదు. సమయం గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
చివరికి, వారు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సమీపంలోని ముర్గి చౌక్కు వెళ్లి, అక్కడ ఓ కాకిని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. ఆ కాకితో పిండం ముట్టించి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఈ ఘటన వేసవి తాపం కేవలం మనుషులనే కాకుండా పక్షులు, ఇతర జీవజాలాన్ని కూడా ఎంతలా ఇబ్బంది పెడుతోందో తెలియజేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi