
హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)తెలంగాణలో రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఉక్కపోత వాతావరణం పెరిగి రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. మార్చి చివరి నుంచి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాల వల్ల కొంత ఉపశమనం లభించినప్పటికీ, ఎండలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ప్రస్తుతం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఏప్రిల్ చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా ఎల్ నినో ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ పెరగడంతో ఎల్ నినో ప్రభావం ఏర్పడి, దక్షిణ భారతదేశంపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడి, వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. వేసవి కాలం మరింత తీవ్రంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ముఖ్యంగా మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశమూ ఉందని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్