లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు తెలుస్తోంది: హరీశ్ రావు
లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు తెలుస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పెదవులు మూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు.
Harishrao


జగిత్యాల, 18 ఏప్రిల్ (హి.స.)కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటలు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశాయని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీని కిషన్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ - పాక్ విభజనతో తెలంగాణను పోల్చుతారా అంటూ మాజీ మంత్రి మండిపడ్డారు.

పార్లమెంట్లో బిల్లు పాస్ అయి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని హరీశ్ రావు తెలిపారు. ఎంపీ తప్పు మాట్లాడితే.. క్షమాపణ చెప్పాల్సింది పోయి వెనుకేసుకుని వస్తున్నారని మండిపడ్డారు. లోక్ సభలో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు తెలుస్తోందన్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పెదవులు మూసుకుని కూర్చున్నారని మండిపడ్డారు. తేజస్వి సూర్య మూతి పగిలే సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచారన్నారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో ఎందుకు ముడి పెట్టారని ప్రశ్నించారు. మెజారిటీ లేకున్నా బిల్లు పెడతారా అని నిలదీస్తూ.. రాజకీయం కోసమే బిల్లు ప్రవేశపెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande