ఆ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ ధన్యవాదాలు
131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న అసలు విషయాలను ప్రియాంక బయటపెట్టారని ముఖ్యమంత్రి అన్నారు
Revanth reddy


హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(శనివారం) ఉదయం సమావేశమయ్యారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించినందుకు ప్రియాంకకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వెనుక ఉన్న అసలు విషయాలను ప్రియాంక గాంధీ బయటపెట్టారని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ప్రజల తరఫున రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘దక్షిణాది రాష్ట్రాలను ఏకీకృతం చేయడంలో నా కృషిని ప్రియాంక గాంధీ అభినందించారు’ అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఢిల్లీలో బిజీబిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామితో సమావేశమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర పారిశ్రామిక విజన్ డాక్యుమెంట్ను కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా ఈవీ బ్యాటరీ తయారీ కేంద్రం ఏర్పాటుకు విన్నవించారు. ఆటో, రక్షణ రంగాల ఉత్పత్తులు, రోబోటిక్స్ తయారీకి ప్రత్యేక పార్కుల కోసం ప్రతిపాదించారు ముఖ్యమంత్రి. 2034 నాటికి హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు కేంద్రం సహకారం కోరారు. ఆధునిక పరిశ్రమలకు అనుగుణంగా జాతీయ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కుమార స్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande