
అమరావతి , 8 ఏప్రిల్ (హి.స.)లోక్సభలో మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ పరిణామం దురదృష్టకరమని, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించే ప్రయత్నానికి ఇదో ఎదురుదెబ్బ అని ఆయన అభిప్రాయపడ్డారు. 'లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం దురదృష్టకరం. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించడం దారుణం. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించాలని ఎన్టీఆర్ నాంది పలికారు. పురుషుల కంటే మహిళలే రాజకీయాల్లో గొప్పగా రాణిస్తారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎంతో అవసరం. రాబోయే రోజుల్లోనైనా మహిళా బిల్లు గెలుస్తుందని ఆశిస్తున్నాను' అని సభాపతి అన్నారు.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా మరోసారి ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్కు స్పీకర్ అయ్యన్న అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలుపుతూ స్పీకర్ ఓ అధికారిక లేఖ రాశారు. హరివంశ్ నియామకం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఆయన తన అనుభవంతో రాజ్యసభ హుందాతనాన్ని మరింత పెంచుతారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా ఆయన తన బాధ్యతలను అత్యంత విజయవంతంగా నిర్వహించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్