
అమరావతి, 18 ఏప్రిల్ (హి.స.)
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు.
మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్తగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని సీఎం సూచించారు. ఇంటింటికీ వెళ్లి 100 శాతం చెత్త సేకరణ జరగాలని, సేకరించిన చెత్తను శాస్త్రీయంగా శుద్ధి చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్దేశించారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో తడి, పొడి చెత్త నిర్వహణ, పరిశుభ్రమైన వంటగదుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. సోలార్ రూఫ్టాప్ల ఏర్పాటు, నెట్ జీరో సాధన, పచ్చదనం పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి. నారాయణ, పీసీబీ ఛైర్మన్ కృష్ణయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ కమిషనర్ సంపత్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi