దోమతెర కప్పుకుని డ్యూటీ.. హైదరాబాద్ సెక్యూరిటీ
దోమతెర కప్పుకుని డ్యూటీ.. హైదరాబాద్ సెక్యూరిటీ
దోమతెర కప్పుకుని డ్యూటీ.. హైదరాబాద్ సెక్యూరిటీ


హైదరాబాద్, 18 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్కు చెందిన ఓ సెక్యూరిటీ గార్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, తీవ్ర చర్చకు దారితీసింది. ఓ నివాస సముదాయంలో రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ దోమల నుంచి రక్షించుకోవడానికి దోమతెర కప్పుకుని విధుల్లో ఉండటం ఈ వీడియోలో ఉంది. ఈ దృశ్యం సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొంటున్న కష్టతరమైన పని పరిస్థితులను కళ్లకు కడుతోంది.

సూరజ్ కుమార్ బౌధ్ అనే యూజర్ ఈ వీడియోను 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. రాత్రిపూట ఓ సెక్యూరిటీ గార్డ్ కుర్చీలో కూర్చుని దోమతెర కప్పుకుని ఉండటాన్ని ఆయన వీడియో తీశారు. అపార్ట్మెంట్లోని నివాసితులు ఏసీ గదుల్లో హాయిగా నిద్రిస్తుంటే, రాత్రంతా బయట విధులు నిర్వర్తించే ఈ గార్డులకు కనీసం సురక్షితమైన, సౌకర్యవంతమైన స్థలాన్ని ఎందుకు కల్పించలేరని ఆయన ప్రశ్నించారు. పేదల పట్ల ప్రజల్లో సానుభూతి, సున్నితత్వం తగ్గిపోవడమే అసలు సమస్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో సెక్యూరిటీ గార్డుల దుస్థితిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఇది డ్యూటీ కాదు, ఆధునిక బానిసత్వం అని ఒకరు కామెంట్ చేయగా, ఈ దృశ్యం నిజంగా హృదయాన్ని కలిచివేస్తోంది అని మరొకరు పేర్కొన్నారు. ఈ గార్డుల బాధ్యత సొసైటీ యాజమాన్యానిదే, కానీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంటూ పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande