
అమరావతి, 19 ఏప్రిల్ (హి.స.)
సింహాచలం, న్యూస్టుడే: ఈ నెల 20న సింహాచలంలో జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి 2 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన జిల్లా యంత్రాంగం, దేవస్థానం అధికారులతో కలిసి తుది ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, దేవస్థానం, పోలీసు శాఖలు సంయుక్తంగా ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వేకువజామున అనువంశిక ధర్మకర్త కుటుంబం దర్శనం అనంతరం సాధారణ దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఈసారి సుమారు 500 మంది ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే అంతరాయం దర్శనాలు ఉదయం 5 గంటలలోగా కల్పిస్తామన్నారు. ఇప్పటికే రూ.300, రూ.వెయ్యి, రూ.1,500 టికెట్లు సుమారు 40 వేలు టికెట్లు విక్రయించినట్లు తెలిపారు. మిగిలిన వారందరికీ ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు. భక్తుల రాకపోకలకు 100 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదన్నారు. కొండ దిగువన 32 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు వివరించారు. వేగవంతమైన క్యూలైన్ల నిర్వహణకు తిరుమల, విజయవాడ నుంచి నిపుణులైన సిబ్బందిని రప్పించినట్లు తెలిపారు. భక్తులు నిర్ణీత స్లాట్లలోనే దర్శనానికి రావాలని సూచించారు.
.:నిజరూప దర్శనానికి వచ్చే భక్తులతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించడంతో పాటు అవసరమైన వారికి తక్షణ సహాయం అందించాలని విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చీ సూచించారు. చందనోత్సవం బందోబస్తు నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన పోలీసులకు బ్రీఫింగ్ నిర్వహించారు. పాత గోశాల దరి కల్యాణ మండపంలో జరిగిన జరిగిన కార్యక్రమంలో సీపీ సూచనలు చేశారు. పోలీసులు అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సుమారు 2,300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ