
అమరావతి, 19 ఏప్రిల్ (హి.స.), దిల్లీ: రాష్ట్రంలోని కీలకమైన రైలు మార్గాన్ని విస్తరించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం దగ్గర్లోని దువ్వాడ మధ్య 3, 4వ రైల్వే లైన్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.9,889 కోట్ల విలువైన 198 కిలోమీటర్ల ప్రాజెక్టుకు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు.
‘‘అత్యధిక రద్దీ ఉన్న హావ్డా-చెన్నై రైల్వే మార్గాన్ని నాలుగు వరుసలుగా మారుస్తున్నాం. అందులో ఇప్పటివరకూ ఒడిశాలోని బాలేశ్వర్, భద్రక్, జఖపుర, హరిదాస్పుర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా, బ్రహ్మపుర వరకు పూర్తిగా నాలుగు వరుసల రైల్వే లైన్లు నిర్మిస్తూ వస్తున్నాం. తదుపరి దశలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో లైన్ల విస్తరణ చేపడుతున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనివల్ల విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు మార్గం సుగమమవుతుంది. సమీపంలోని థర్మల్ పవర్, సిమెంట్, స్టీల్ ప్లాంట్లతోపాటు రసాయన ఎరువులు, ఆహారధాన్యాలు, బాక్సైట్, జిప్సం, సున్నపురాయి రవాణాకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుంది. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల గుండా 198 కి.మీ. సాగే రూ.9,889 కోట్ల విలువైన ప్రాజెక్టును 5 ఏళ్లలో పూర్తిచేయాలన్నది లక్ష్యం.
ఇందులో భాగంగా గోదావరిపై 4.3 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే వంతెన నిర్మాణం జరుగుతుంది. ఇది చాలా సంక్లిష్టమైన ప్రాజెక్టు. ఇందులో మొత్తం 3 మెగా వంతెనలు, 58 పెద్ద, 416 చిన్న వంతెనలు, 73 ఆర్యూబీలు, 3 ఆర్ఓబీలు, 2.7 కి.మీ. పొడవైన ఒక వయాడక్ట్ వస్తాయి. ఇప్పుడున్న రైల్వేరూట్లను అనుసంధానం చేసి దూరాన్ని మరింత తగ్గించే విధంగా 8 కి.మీ. మేర కొత్త ఎలైన్మెంట్లు కలుపుతారు. ప్రస్తుతం ఈ లైన్ రవాణా సామర్థ్యం 130%కి చేరింది. దానివల్ల తరచూ రద్దీ ఏర్పడి రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా మూడు, నాలుగు లైన్లు నిర్మించడం వల్ల ఉన్న లైన్లపై ఒత్తిడి తగ్గి నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. అన్నవరం, అంతర్వేది, ద్రాక్షారామ లాంటి పర్యాటక ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుంది. మొత్తం ట్రాక్ పొడవు 458 కి.మీ. ఉంటుంది. ఈ కారిడార్ను హైస్పీడ్కు అనుకూలంగా డిజైన్ చేస్తున్నారు. మొత్తం ‘కవచ్’ రక్షణ ఉంటుంది. ఇది పూర్తయితే అదనంగా 29 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయడానికి వీలవుతుంది. రోడ్డుమార్గాన వెళ్లే సరకు రవాణా.. రైలుమార్గానికి మళ్లడం వల్ల ఏటా 51.5 కోట్ల కేజీల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. అది 2 కోట్ల చెట్ల పెంపకంతో సమానం. అలాగే రూ.1,151 కోట్ల సరకు రవాణా వ్యయం ఆదా అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 135 లక్షల మానవ పని దినాలు లభ్యమవుతాయి. పర్యాటక, పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంవల్ల అదనపు ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి’’ అని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ