
తిరుపతి, 19 ఏప్రిల్ (హి.స.)ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ యువ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించిన యువతి తనను నిరాకరించిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద ఘటన తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి చెందిన జే. మహేంద్ర (20) అనే యువకుడు తిరుపతిలో ఉంటూ చదువుకుంటున్నారు. ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ మూడో సంవత్సరం చదువుతున్నారు. మహేంద్ర తిరుపతిలోని వెంకటరమణ లే అవుట్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, సదరు యువతి మహేంద్ర ప్రేమను నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ప్రేమ వ్యవహారంలో ఎదురైన చేదు అనుభవంతో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిన మహేంద్ర తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ