కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం : మంత్రి వివేక్ వెంకట స్వామి
సిద్దిపేట, 19 ఏప్రిల్ (హి.స.) మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి నిప్పులు చెరిగారు. కమిషన్ల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి, కేసీఆర్ కుటుంబ సభ్యులు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని, కానీ ప్రజల కోసం
మంత్రి వివేక్


సిద్దిపేట, 19 ఏప్రిల్ (హి.స.)

మాజీ సీఎం కేసీఆర్ పై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి నిప్పులు చెరిగారు. కమిషన్ల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి, కేసీఆర్ కుటుంబ సభ్యులు వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని, కానీ ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించలేదని విమర్శించారు.

సిద్దిపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి వివేక్ వెంకటస్వామి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్జేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో తీసుకున్న అప్పులకు నెలకు రూ.5 వేల కోట్లు చొప్పున, సంవత్సరానికి రూ.60 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తోందని తెలిపారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ. లక్ష కోట్లు వృథా చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మించి ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ 60 టీఎంసీల నీళ్లు కూడా పంపు చేయలేకపోయారని ఆరోపించారు.

పంపిన నీళ్లు కూడా వర్షాల వల్ల వృథా అయ్యాయని తెలిపారు. సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి కట్టారని, కానీ జిల్లాకు 500 పడకల ఆసుపత్రి కడితే సరిపోతుందని, అందరికీ ఉపయోగపడేదని అన్నారు. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, కేసీఆర్ కుటుంబ సభ్యులు వంద ఎకరాల ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని, కానీ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదని విమర్శించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు

చెల్లిస్తూనే, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గుంపులుగా కాకుండా కలిసికట్టుగా పనిచేసి సిద్దిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రత్యేక నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande