
ములుగు, 19 ఏప్రిల్ (హి.స.)
అన్ని ఉండి ఆరోగ్యం బాగా లేకపోయినా ప్రతి వ్యక్తికి మనశ్శాంతి లేకపోతే ఆ వ్యక్తి జీవనం బూడిదతో సమానమని, అందరూ సురక్షితంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని, పలు రకాల ప్రమాదాల కారణంగా కుటుంబాలు ఆగమాగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఆదివారం ములుగు జిల్లాలోని ఇంచర్ల గ్రామ శివారులోని ఎం ఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో మంత్రి సీతక్క తో పాటు కలెక్టర్ దివాకర టి.ఎస్, అశ్వారావుపేట శాసనసభ్యులు జాడి ఆదినారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అక్క అంటే అండగా ఉండే సీతక్క నియోజకవర్గంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమని, పోరాటం, తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉండాలని వాటితో ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు బ్రతికి ఉంటేనే ఏదైనా సాధిస్తారని, ఈనెల 14న ఖమ్మంలో జరిగిన సంఘటన ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ఏం చేసినా లాభం ఉండదని ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ ముందుకు సాగాలని, అన్ని గ్రహిస్తూనే వాహనాలు నడిపిన పక్షంలో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవని వివరించారు.
కుటుంబంలో ప్రతి ఒక్కరు బతికి ఉంటేనే గౌరవం ఉంటుందని, ప్రమాదాలు జరిగిన కుటుంబంలో కుటుంబ సభ్యుల గోస వర్ణాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి వ్యక్తితో పాటు ఇతర వ్యక్తి ప్రాణం సైతం ముఖ్యమని గ్రహిస్తూ ముందుకు సాగాలని మంత్రి కోరారు. ప్రతిరోజు మన రాష్ట్రంలో 20 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, చనిపోయిన కుటుంబ సభ్యులు ఆవేదన ఉంటుండగా వికలాంగులుగా మారిన వారి పరిస్థితి దయనీయంగా మారుతున్నదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు