
:అనకాపల్లి , 19 ఏప్రిల్ (హి.స.):అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఓప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడగా, త్రుటిలో పెద్ద ముప్పు తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, నక్కపల్లి పరిసర ప్రాంతాల్లోకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రహదారి పక్కనే ఉన్న పంట కాల్వ గుంతలోకి బస్సు దూసుకుపోయి బోల్తా పడింది. బస్సులోని 38 మంది ప్రయాణికుల్లో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈరోజు(ఆదివారం) తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ఈ బస్సు చెన్నైకు బయలు దేరిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను చికిత్స నిమిత్తం సమీపంలోని నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నక్కపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు.
డ్రైవర్ అతివేగం లేదా నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.
రాత్రి సమయాల్లో ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణించే వారు అప్రమత్తంగా ఉండాలని, డ్రైవర్లు అతివేగంగా వెళ్తున్నా, అజాగ్రత్తగా ఉన్నా వెంటనే ప్రశ్నించాలని పోలీసులు సూచించారు. గాయపడిన వారిలో ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలపడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ