
హైదరాబాద్, 19 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పవన్ అన్నా.. డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకోండి. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాను అని లోకేష్ తన సందేశంలో పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శనివారం సాయంత్రం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం అధికారులతో సమావేశంలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వ్యక్తిగత వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ఎంఆర్ఐ స్కాన్ సహా పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం శస్త్రచికిత్స అవసరమని సిఫార్సు చేయడంతో సర్జరీ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని జనసేన పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్ కొద్దిరోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi