
హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ టూర్పై ఎంపీ చామల కిరణ్ రెడ్డి(MP Chamala Kiran Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందన్నారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు. జీవన్ రెడ్డిని ఎప్పుడూ హరీశ్ రావు పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లినప్పుడు హరీశ్ వెళ్లలేదని అన్నారు. రెండవ సారి జగిత్యాలకు వెళ్లినప్పుడు కేటీఆర్.. హరీశ్ రావు ఇంటికి వెళ్లి బ్రతిమిలాడి తీసుకువెళ్లారంటూ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ఇంటికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా హరీశ్ రావు వెళ్లలేదని ఎంపీ తెలిపారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ సంవత్సరం తర్వాత ఫామ్హౌస్ నుంచి బయటకు వస్తుంటే హరీశ్ రావు ఢిల్లీ వెళ్లారంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారంలో ఉందన్నారు.
జీవన్ రెడ్డికి కాంగ్రెస్ సముచిత స్థానం ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ అంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీన పడిందని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అంటూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్