కేసీఆర్ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
కేసీఆర్ అనే పులి ఫాం హౌస్కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.
Congress


హైదరాబాద్, 20 ఏప్రిల్ (హి.స.)కేసీఆర్ అనే పులి ఫాం హౌస్కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. పులి తిన్న ఆవుల గురించి బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్ను దగ్గర నుంచి చూస్తేనే జీవన్ రెడ్డికి ఆయన కథేమిటనేది అర్థమవుతుందన్నారు. జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినప్పుడు కనిపించ లేదా? అని ఆయన్ని సూటిగా ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని ఆరోపించారు. రేవంత్ సభ 20 రోజుల ముందే ఫిక్స్ అయిందని గుర్తు చేశారు. కేసీఆర్కి మాది కౌంటర్ ప్రోగ్రాం కాదని కుండబద్దలు కొట్టారు. ఆశల పల్లకిలో ఊరేగించడం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కి అలవాటేనంటూ వ్యంగ్యంగా అన్నారు. జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో అంటూ ఎద్దేవా చేశారు.

మేడిగడ్డలో కేసీఆర్ చేసిన మోసాలపై జీవన్ రెడ్డే తమకు పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్ గుర్తు చేసుకున్నారు. అలాంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోరస్ ఇస్తున్నాడని విమర్శించారు. గతంలో కేకే, డీఎస్ లాగే జీవన్ రెడ్డి కూడా బాధపడుతారని చెప్పారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని స్పష్టం చేశారు. రేవంత్ పోవాలి మార్పు రావాలి అనే హక్కు ఎక్కడిది? జీవన్ రెడ్డికి అంటూ ఆయనపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande