
ఖమ్మం, 20 ఏప్రిల్ (హి.స.)
కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు
నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న జన్మదిన వేడుకల్లో.. ఆత్మీయ సమ్మేళనమే నాకు తెలియదు కానీ, హరీష్ రావు మాట్లాడే తీరును చూస్తే ఆయన మానసిక స్థితి సరిగా లేదని అర్థమవుతుందని అన్నారు. పదేళ్ల పాలనలో మీరు ఆర్థిక విధ్వంసం సృష్టించి ఈరోజు మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల హరీష్ రావు పై ఫైర్ అయ్యారు. సీతారామ ప్రాజెక్ట్ నా చిరకాల స్వప్నం అని దాని పూర్తి చేసేందుకు ఇల్లందు నియోజకవర్గంలో రోళ్ళపాడు వద్ద శంకుస్థాపన చేయడం జరిగిందని, మీ హయాంలో కమిషన్ల కోసం సీతారామ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత నిధులు కేటాయించి సీతారామ ప్రాజెక్టు ను పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సత్తుపల్లి టన్నెల్ కోసం రూ. 1500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. గోదావరి జలాలను వైరా రిజర్వాయర్ కు తరలించిన ఏకైక ప్రభుత్వం రేవంత్ సర్కార్ అన్నారు. మీ హయాంలో రైతు బంధు, సీఎం రిలీఫ్ ఫండ్ స్కాం లు జరగలేదా అంటూ ప్రశ్నించారు. భూ కబ్జాలు, ప్రజల పై కేసులు పెట్టించి నానా ఇబ్బందులకు గురిచేసింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. రుణమాఫీ మొదటి మూడు నెలల్లో రైతులు ఖాతాలో జమ చేసిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అన్నారు.
రూ.25 వేల కోట్ల రూపాయలను రైతు ఖాతాలో జమ చేశామని, మీకు అనుమానం ఉంటే ఖాతా నెంబర్లు ఇస్తాము వెళ్లి చెక్ చేసుకోండి అన్నారు. పది సంవత్సరాల్లో మీరు సృష్టించిన విధ్వంసాన్ని సరి చేసుకుంటూ కష్టాల్లో ఉన్న కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. పార్టీలో హరీష్ రావు స్థాయి ఏందో ముందు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు