మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.
మండే ఎండల్లోను బెజవాడ వాహనదారులను పలకరిస్తున్న చిరు జల్లులు.
విజయవాడ


విజయవాడ, 20 ఏప్రిల్ (హి.స.)

బెజవాడలో ఎండలంటే.. అది సాధారణ వేడి కాదు, ఒక్క అడుగు బయట పెట్టాలంటేనే గుండె దడ పెంచే స్థాయి, ఉదయం సూర్యుడు కాస్త వెలిగినా సరే.. మధ్యాహ్నానికి వచ్చేసరికి నగరం మొత్తం అగ్ని గోళంలా మారిపోతుంది. రోడ్లపై నుంచి ఎగిసే ఎండ మంటలు, వేడి అలలు, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ప్రజలు అందరూ ఇంటికే పరిమితం అయిపోతున్నారు.అయితే ఎండలో ప్రయాణించే వాహనదారులకు, పాద చారులకు మిస్ట్ వెహికిల్స్ ఒక చిన్న రిలీఫ్, కానీ చాలా విలువైన ఉపశమనం. ఒక్కసారి నీటితో నింపితే దాదాపు 6 వేల లీటర్ల సామర్థ్యంతో ఈ వాహనాలు సుమారు 18 కిలోమీటర్ల వరకు చల్లదనాన్ని పంచగలవు. సాధారణంగా వాడే నీటి ట్యాంకర్లతో పోలిస్తే ఇవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. నీటిని వృథా కాకుండా దాదాపు 90 శాతం వరకు ఆదా చేస్తూ, అవసరమైన చోటే ఉపయోగపడేలా డిజైన్ చేశారు. ఇంతటితో ఆగిపోలేదు,ఈ మిస్ట్ వెహికిల్స్ మరో ముఖ్యమైన పని కూడా చేస్తున్నాయి. గాలిలో తేలియాడే కాలుష్య కణాలను తగ్గించడం. ముఖ్యంగా ఆరోగ్యానికి హానికరమైన PM 2.5, PM 10 వంటి సూక్ష్మ కణాలను నియంత్రించడం ద్వారా నగర గాలి నాణ్యతను మెరుగుపరుస్తున్నాయి.

ఎండల కారణంగా రోడ్లు విపరీతంగా వేడెక్కి హీట్ ఐలాండ్ ప్రభావం కనిపించే నగరాల్లో ఈ తరహా టెక్నాలజీ చాలా అవసరం. ఈ వాహనాల్లోని హై ప్రెషర్ పంపులు నీటిని సూక్ష్మ బిందువులుగా మార్చి గాలిలోకి పంపడం వల్ల అవి వేడిని గ్రహించి వెంటనే ఆవిరైపోతాయి.

విజయవాడ నగర పాలక సంస్థ 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ మిస్ట్ వెహికిల్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ప్రధాన రోడ్లపై వీటిని నడిపిస్తూ ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నారు. ఈ చర్యపై నగరవాసుల నుంచి మంచి స్పందన వస్తోంది. మొత్తానికి,మండుతున్న ఎండల మధ్యలో ఒక చల్లని ప్రయత్నంగా ఈ మిస్ట్ వెహికిల్స్ నిలుస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టి, నగరంలోని అంతర్గత రహదారుల వరకు ఈ సేవలను విస్తరించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande