
అమరావతి, 20 ఏప్రిల్ (హి.స.)ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన భార్య నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ హృదయపూర్వక సందేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మొదలుపెట్టిన ఆమె, చంద్రబాబు జీవితం పూర్తిగా తెలుగు ప్రజలకే అంకితమని కొనియాడారు. ప్రతి పుట్టుకకు ఒక కారణం ఉంటుందని, చంద్రబాబు జన్మించింది తెలుగు ప్రజల సేవ కోసమేనని ఆమె తన సందేశంలో ఉద్ఘాటించారు. వ్యక్తిగత వేడుకల కన్నా ప్రజా సేవలోనే ఆయనకు అసలైన ఆనందం లభిస్తుందని పేర్కొంటూ భర్తపై తనకున్న గౌరవాన్ని, ప్రేమని చాటుకున్నారు.
తన భర్త చంద్రబాబు నిండు నూరేళ్లు పూర్తి ఉత్సాహంతో, సంపూర్ణ శక్తితో, ఆరోగ్యంతో వర్ధిల్లాలని భువనేశ్వరి ఆకాంక్షించారు. ప్రజా క్షేమం కోసమే నిరంతరం తపించే ఆయన సంకల్పానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె కోరుకున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల నుండి అందిన ఈ ఆత్మీయ స్పందన అటు పార్టీ శ్రేణుల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. చంద్రబాబు ప్రజా జీవితంలో ఆమె ఒక బలమైన వెన్నుముకగా ఉంటూ, ఇలాంటి సందర్భాల్లో తన మద్దతును చాటుకోవడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV