
భద్రాద్రి కొత్తగూడెం, 20 ఏప్రిల్ (హి.స.)
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99
రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మొదటి రోజు జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం టేకులపల్లి మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విధానాన్ని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. వంటగది పరిస్థితులు, వంట తయారీ ప్రక్రియను తనిఖీ చేసి, విద్యార్థులకు అందించే భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వంటకు ఉపయోగించే సరుకుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు
. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్యం పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటిస్తూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్ను పరిశీలించిన కలెక్టర్, అది ఎప్పుడు ఏర్పాటు చేశారో, గత రెండు సంవత్సరాలుగా ఎందుకు వినియోగంలో లేదో సంబంధిత అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు పాఠశాలలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా సమస్య ఉండటంతో ప్లాంట్ను ఉపయోగించలేక పోతున్నామని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్, తక్షణమే త్రీఫేస్ కరెంట్ సమస్యను పరిష్కరించి ఆర్వో ప్లాంట్ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం టేకులపల్లి మండలం నంద్యా తండాలోని ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారికి అందుతున్న సదుపాయాలు, మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు