
నక్కపల్లి, 21 ఏప్రిల్ (హి.స.), నక్కపల్లి మండలం ముకుందరాజుపేటలోని ఓ ఇంట్లో భారీగా బంగారం చోరీ జరగ్గా, ఈ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడు బాధితుడి బంధువు కావడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించి నక్కపల్లి సీఐ జె.మురళీ సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముకుందరాజుపేటకు చెందిన మనబాల రమణ పాయకరావుపేట మండలం శ్రీరాంపురంలోని ఓ వైన్షాప్లో పనిచేస్తున్నారు. నిన్న ఉదయం ఇతడు దుకాణానికి వెళ్లగా, తల్లి మంగమ్మ ఇంటికి తాళం వేసి పనికి వెళ్లారు. భార్య కాన్పు నిమిత్తం పుట్టింటికి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసుకుంటే ఇంటి తలుపులతో పాటు బీరువా తాళాలు తెరిచి ఉన్నాయి. బీరువాలో భద్రం చేసిన పది తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. అదే రాత్రి బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా.. రమణ సమీప బంధువైన పాయకరావుపేట మండలం పెంటకోటకు చెందిన కొల్లి శ్రీను ఇటీవల ముకుందరాజుపేటలో రమణ ఇంటికి వచ్చి ఓ రోజు ఉండి వెళ్లిపోయినట్లు గుర్తించారు.. దీంతో ఈ దిశగా పోలీసులు దృష్టి సారించారు. శ్రీను నడవడికపై నిఘా పెట్టారు. కాగిత టోల్గేట్ వద్ద పట్టుకుని ఇతడి నుంచి చోరీ సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. విచారణలో ఎస్సై కె.సన్నిబాబు, సాహిబా అంజుమ్ తదితరులు పాల్గొన్నారు. రోజు గడవకుండానే కేసును ఛేదించడం పట్ల ఎస్పీ తుహిన్సిన్హా సీఐ, ఎస్సైలు, సిబ్బందిని అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ