
సంగారెడ్డి, 21 ఏప్రిల్ (హి.స.)ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ నేతలకు మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి మంత్రి దామోదర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాయకుల్లో వర్గపోరు ఉంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పదవిని అనుభవించాలని మంత్రి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బలమని.. కార్యకర్తలే ధైర్యం, స్థైర్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, విశ్వాసం తక్కువని... అవకాశవాదం ఎక్కువన్నారు. ఎప్పుడూ శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని సూచించారు. 70 వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని వెల్లడించారు. ఆరోగ్య శాఖలో ఇంకో 3 నెలల్లో మొత్తం 20 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం పథకం దేశంలో ఎక్కడా లేదని దామోదర రాజనర్సింహ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్