
జనగామ, 21 ఏప్రిల్ (హి.స.)సకల జనుల పోరాటం, ఎందరో ఆత్మబలిదానాల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చిన తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం పాలైందని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం మాత్రమే వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకుందని ఆరోపించారు. ఇప్పుడు వాళ్లే నీతులు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ‘కడియం శ్రీహరి ఎప్పుడూ తప్పుడు పనులు చేయడు. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్నాను కాబట్టి రాజకీయాలలో నిలబడగలిగాను’ అని ఎమ్మెల్యే వెల్లడించారు.
అవినీతి, అక్రమాలకు దూరంగా ఉన్నానని.. అందుకే 35 ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. గతంలో తప్పుడు పనులు చేసి తలవంపులు తీసుకువచ్చిన వారు చాలా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నియోజకవర్గ ప్రజలు గర్వపడే విధంగానే నా పని తీరు ఉంటుంది’ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్