
నల్గొండ, 21 ఏప్రిల్ (హి.స.) ఒకేసారి బంగారు తెలంగాణ చేస్తామని మేము ఎప్పుడూ చెప్పలేదని పదేళ్లలో అప్పులు చేసి వెళ్లి ఒకేసారి బంగారం చేయాలంటే సాధ్యమేనా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. గత ప్రభుత్వం హయాంలో పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి 3.78 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి తినే బియ్యమే పేదలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవాళ నల్గొండ (Nalgonda) జిల్లాలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రూ. 10,160 కోట్లు, సన్నబియ్యం పథకానికి రూ. 5 వేల కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు రూ.6 వేల కోట్లకు పైగా చెల్లించిందన్నారు.
ధాన్యం నిల్వల విషయంలో రూ.11 వేల కోట్ల స్కామ్ జరిగిందని, కాంగ్రెస్ వచ్చాక కొంత మేర ధాన్యం రికవరీ చేయించామన్నారు. ఈ అంశంలో నల్గొండ జిల్లాలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయని డైరెక్టర్లు, ఎండీని అరెస్టు చేస్తే ఇటీవలే బెయిల్ వచ్చిందన్నారు. నల్గొండ జిల్లాలోనే రూ. 4 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని బకాయిలు చెల్లించి రెగ్యులర్ గా నడుపుకోవాలని చెప్పామన్నారు. చర్చల తర్వాత బకాయిలు చెల్లించే విధంగా ఒప్పుకున్నారని చెప్పారు. జిల్లాలో పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రచించామని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా కృష్ణాజలాలు తెప్పిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు