
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)
తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాటపడుతున్న వేళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు దిగితే తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని బస్సులు ఎలా తిరుగుతాయో మోము చూస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం కావాలనే కార్మికులు సమ్మెవైపు వెళ్లేల చేస్తోందని ఆరోపించారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదని ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అన్నారు. మంగళవారం అర్ధరాత్రి (ఏప్రిల్ 21 అర్ధరాత్రి) నుంచే సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం ఉదయం హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న.. ఆర్టీసీ సమ్మెకు ప్రజాసంఘాల మద్దతు ప్రకటించాయని మేము సమ్మెబాట పడితే ఇది మరో సకల జనుల ఆర్టీసీ సమ్మెగా మారుతుందని హెచ్చరించారు. సబ్బండ వర్గాలు మా వెనుక నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.మాతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తామని ఈ విషయంలో మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయన్ననారు. మేము కోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం మమ్మల్ని సమ్మెవైపు వెళ్లకుండా నివారించే ప్రయత్నం చేసి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని కానీ విలీన ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు పెట్టలేదన్నారు. అలాగే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదన్నారు. ఆర్టీసీ విలీనం కమిటీకి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని ఈ కమిటీని గత ప్రభుత్వమే వేసిందన్నారు. కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని ఆరోపించారు. ఏ కమిటీ నివేదిక చ్చిందని వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారని ప్రశ్నించారు.
పక్క రాష్ట్రం ఏపీలో జగన్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందని మరి ఇక్కడెందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు పరం చేసే యోచనలో ఉందని ఆరోపించారు. మా సమ్మె వెనుకు ఎలాంటి రాజకీయ శక్తులు లేవని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకరే ఏడాది కాలంగా మాట తప్పడం వల్లే సమ్మెబాట పట్టాల్సి వస్తోందన్నారు. మా వెనుక ఉగ్రవాదులెవరు లేరని ఉన్నదల్లా కార్మికులేనన్నారు. మా డిమాండ్లు పరిష్కరించకుండే సమ్మె విషయంలో వెనక్కి తగ్గేదే లేదని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..