వేసవి సెలవుల్లో విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Summer schools


అమరావతి, 21 ఏప్రిల్ (హి.స.)వేసవి సెలవుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వనరుల వద్ద ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించాలని స్పష్టం చేసింది. కాల్వలు, చెరువులు, నదులు వంటి నీటి ప్రాంతాలకు పెద్దల పర్యవేక్షణ లేకుండా విద్యార్థులు వెళ్లకూడదని హెచ్చరించింది. అలాగే తెలియని నీటి ప్రాంతాల్లో ఈతకు దిగకూడదని స్పష్టం చేసింది. ప్రమాద పరిస్థితుల్లో ఇతరులను రక్షించేందుకు స్వయంగా ప్రయత్నించకుండా వెంటనే పెద్దలకు సమాచారం ఇవ్వాలని సూచించింది.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం వంటి ఆరోగ్య జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని పేర్కొంది. హీట్ స్ట్రోక్ లక్షణాలు, వాటి నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది.

రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించేలా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని విద్యాశాఖ సూచించింది. అలాగే స్క్రీన్ టైమ్ తగ్గించి క్రీడలు, పుస్తక పఠనం వంటి ఉపయోగకరమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రోత్సహించాలని సూచించింది. తల్లిదండ్రులకు కూడా భద్రతా సూచనలు తెలియజేయాలని పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చింది. పాఠశాలల్లో భద్రతా సూచనలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించింది. కాల్వలు, చెరువుల సమీపంలో ఉన్న పాఠశాలలు మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

జిల్లా విద్యాధికారులు (DEOs), మండల విద్యాధికారులు (MEOs) ద్వారా కచ్చితమైన పర్యవేక్షణ జరగాలని, అన్ని సూచనలు అమలు చేయాలని ఆదేశించింది. వేసవి సెలవులకు ముందు 100 శాతం విద్యార్థులకు కౌన్సెలింగ్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అమలులో ఏ విధమైన నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande