
వరంగల్, 21 ఏప్రిల్ (హి.స.)
వేలాది అమరులైతే తెలంగాణ రాష్ట్రం
ఏర్పడిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు . ఇవాళ వరంగల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే అందరి జీవితాలు మారుతాయని ప్రజలు ఆశించారని, కానీ గత పదేళ్లలో కేవలం ఒకే ఒక్క కుటుంబం బాగుడిందని ఆయన విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్లు సంపాదించుకుందని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో ఆ కుటుంబం ఆస్తులు పెంచుకుంటే, తెలంగాణ (Telangana) ప్రజల నెత్తిన మాత్రం రూ.వేల కోట్ల అప్పులు మిగిల్చారని మండిపడ్డారు. బీఆర్ఎస్ (BRS) పార్టీలో అప్రజాస్వామిక పద్ధతులు పెరిగిపోయాయని, అందుకే తాను ఆ పార్టీని వీడి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు లేని చోట ఉండలేకే తాను ఆ నిర్ణయం తీసుకున్నానని కడియం తెలిపారు.
తన రాజకీయ జీవితంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీకి సంచలన సవాల్ విసిరారు. తాను తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ చిన్న తప్పు కూడా చేయలేదని, ఎక్కడా అవినీతికి పాల్పడలేదని అన్నారు. ఒకవేళ అవినీతి చేసినట్లుగా ఎవరైనా ఆధారాలతో నిరూపిస్తే, క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని కుండబద్దలు కొట్టారు. నిబద్ధతతో పనిచేసే తనపై అసత్య ఆరోపణలు చేయడం ఇప్పటికైనా మానుకోవాలని కడియం బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు