
హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్
కమిషన్(Justice P.C. Ghosh Commission) నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్వాగతించారు. ఈ తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్యలకు గట్టి చెంపపెట్టు అని ఆయన అభివర్ణిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా న్యాయస్థానాలు ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. తాము ముందు నుంచి చెబుతున్నట్లే.. అది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు, ముమ్మాటికీ పీసీసీ (PCC) నివేదిక అని ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న రేవంత్ తీరును హైకోర్టు తీర్పు ఎండగట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. సహజ న్యాయ సూత్రాలను విస్మరించి, నిబంధనలకు పాతరేశారని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో రెండున్నరేళ్లుగా పడావు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం పన్నిన రాజకీయ కుట్రలకు బ్రేక్ పడిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా
కక్షసాధింపు రాజకీయాలు పక్కన పెట్టి, ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి రైతన్నలకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..