
హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం
(Construction of Kaleshwaram project) లో జరిగిన అవినీతి, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) డిమాండ్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కంటే ముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఈ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రాజెక్టును నిర్మించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారని, కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రజలకు పూర్తి నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో బీజేపీ నాయకులపై బాధ్యత మరింత పెరిగిందని ఎంపీ చామల వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు చొరవ తీసుకుని ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ (CBI investigation)ను వేగవంతం చేయాలని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తుది తీర్పు వెలువడినప్పుడు అన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..