
ఖమ్మం, 22 ఏప్రిల్ (హి.స.)
ఖమ్మం నగరంలో కొనసాగుతున్న
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నగరంలోని చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జ్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ల ప్రస్తుత పరిస్థితి, మరమ్మత్తుల అవసరం, ట్రాఫిక్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. చర్చి కాంపౌండ్ ఓవర్ బ్రిడ్జ్ల్ప ప్రయాణించే వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
బ్రిడ్జ్ మధ్యభాగంలో రబ్బరు స్ట్రిప్స్ ఏర్పాటు చేసి వాహనాల ప్రయాణాన్ని సాఫీగా మార్చాలని సూచించారు. అలాగే, బ్రిడ్జ్లపై ఉన్న గుంతలు, పగుళ్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాలని, బ్రిడ్జ్ మీద ఉన్న పూల కుండలలో మొక్కలు సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, ప్రమాదాల సూచనలు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగర అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న అన్ని పనులు నాణ్యతతో, సమయపాలనతో పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను దశలవారీగా నిర్వహించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు