ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, 22 ఏప్రిల్ (హి.స.) ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లాలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ డిపోను బు
Collector


నాగర్ కర్నూల్, 22 ఏప్రిల్ (హి.స.)

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో

జిల్లాలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. నాగర్కర్నూల్ డిపోను బుధవారం ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను పరిశీలించారు. సమ్మె కారణంగా సాధారణ రవాణా సేవలు దెబ్బతినే అవకాశమున్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ప్రయాణ సౌకర్యాలు నిరంతరంగా కొనసాగడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. సమ్మె పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. గ్రామీణ, సుదూర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సుల రాకపోకలను పెంచాలని చెప్పారు.

డిపోలో అందుబాటులో ఉన్న బస్సులు, నడుస్తున్న రూట్లు, ప్రయాణికుల రద్దీ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలికంగా నియమించి సేవలు కొనసాగించాలని సూచించారు. నియామకాల్లో ప్రమాణాలు పాటిస్తూ వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రైవేటు సిబ్బంది విధుల్లో ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ డిపోల నుంచి ప్రజల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పరిస్థితులను నిరంతరం

పర్యవేక్షిస్తూ అవసరమైతే అదనపు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కలిసి ఆర్టీసీ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తున్న విషయాన్ని కార్మికులకు తెలియజేయాలని ఆదేశించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉద్యోగులు, రైతులకు అనుకూలంగా బస్సు సర్వీసులను పెంచాలని చెప్పారు. అవసరమైతే ప్రైవేటు బస్సులను కూడా వినియోగంలోకి తేవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లేని, ఆరోగ్యవంతులైన డ్రైవర్లను మాత్రమే నియమించాలని స్పష్టం చేశారు. ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, తాత్కాలికంగా నియమితులయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు పూర్తి భద్రత కల్పిస్తామన్నారు. విధుల్లో ఆటంకాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా రవాణా సేవలు సజావుగా సాగేందుకు శాంతి భద్రతలను కట్టుదిట్టం చేస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande