
హుజురాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)
హుజరాబాద్ మండలంలోని సిరిసపల్లి శివారులో ప్రభుత్వం మొండిగా ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డుపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, పర్యావరణానికి విఘాతం కలిగించే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు అంబేద్కర్ చౌరస్తాను స్తంభింపజేశాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వేదికగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు.
సిరిసపల్లి శివారులో 'వేస్ట్ టు ఎనర్జీ' పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలంటూ కమలదళం రోడ్డుపై బైఠాయించింది. డంపింగ్ యార్డ్ హటావో.. హుజరాబాద్ బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో చౌరస్తా ప్రాంతం ఉద్రిక్తంగా మారిపోయింది. వరంగల్ - కరీంనగర్ ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సహా పలువురు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. నేతలను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. అరెస్టు చేసిన వారందరినీ స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఊరుకోం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని 24 గంటల్లోగా వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదు. రాబోయే రోజుల్లో 'కాంగ్రెస్ సర్కార్ హటావో' నినాదంతో ముందుకు వెళ్తాం హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు