
జగిత్యాల, 22 ఏప్రిల్ (హి.స.)
పేద ప్రజల కష్టాలను తీర్చి, వారికిఅండగా నిలవడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని, అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బుధవారం 316 మంది లబ్ధిదారులకు రూ. 1 కోటి 5 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని, కేసీఆర్ పాలన కేవలం విధ్వంసానికి, అవినీతికి నిలయంగా మారిందని విమర్శించారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ నైజం అయితే.. పేదలకు అండగా నిలబడటం కాంగ్రెస్ నైజం అని, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందిస్తామని, మాట ఇస్తే తప్పని ప్రభుత్వం మాది అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా, ప్రజల సంక్షేమం కోసం వెనకడుగు వేయబోమని, ప్రజా పాలనను మరింత బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..