
అమరావతి, 22 ఏప్రిల్ (హి.స.)
రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణిస్తున్న ఓ కారు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం.. కారు అతివేగంతో వీరవల్లి (Veeravelli) టోల్ప్లాజా వైపు వస్తోంది. ఈ క్రమంలోనే కారు అదుపు తప్పి టోల్గేట్ సమీపంలోని కాంక్రీట్ స్తంభాన్ని అత్యంత వేగంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న వారు లోపలే చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. మృతులను చాపర్ల రాజు, హనుమంత రావు, సాగర్గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. మరొక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. తెల్లవారుజామున ప్రయాణం కావడంతో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. నిద్రమత్తులో కారుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV