
హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.)
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు(Former CM Nadendla Bhaskar Rao) మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భవవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. భాస్కర రావు తనయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్కు ఫోన్ చేసి పరామర్శించారు సీఎం. భాస్కర్ రావు కుటుంబసభ్యులకు సీఎం, మంత్రి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భాస్కరరావు 90 ఏళ్ల వయస్సులో మృతి చెందిన విషయం తెలిసిందే. నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. గురువారం పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, 1984లో నెల రోజుల పాటు ఏపీ సీఎంగా పని చేశారు.
ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్లోని ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నారు.కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు గురువారం (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం జరగనున్నాయి. రేపు మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈ అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. నాదెండ్ల మృతికి సంతాపంగా పలువురు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi