
ఖమ్మం, 22 ఏప్రిల్ (హి.స.) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం వారు ఖమ్మం నగరం కు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల గడప వద్దకే పథకాలను చేరవేస్తున్నామని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ప్రారంభించిన మంచి పథకాలను నిలిపివేయకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. అదనంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 6 వేల రైతు భరోసా, సన్న బియ్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఆపద సమయంలో పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని, పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అందించేందుకు 20 నుంచి 25 ఎకరాల్లో 2500 మంది విద్యార్థులు చదివే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు చెప్పారు.ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రభుత్వం పై అనవసర విమర్శలు చేస్తున్నాయని, ఈ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ఆపిందో చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇండ్ల పేరుతో పేదలను మోసం చేసిందని, అయితే తమ ప్రభుత్వం తొలి దశలోనే సుమారు 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు అందజేస్తామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పిస్తామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..