
విజయవాడ, 23 ఏప్రిల్ (హి.స.)మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఒకటని అన్నారు. మహిళలకు చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ ఉండాలని అంటూనే.. 2014కి ముందు ఉన్న ప్రభుత్వాలు దీనిని అమలు చేయకుండా సాకులు చెప్పాయని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలతో చర్చించి, అత్యధిక మెజారిటీతో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిందన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ను 2029 ఎన్నికల నుంచే అమలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. 25 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డుకున్న విపక్షాలు మరోసారి ఆటంకపరుస్తున్నాయని మండిపడ్డారు. మహిళలు పార్లమెంట్కు విచ్చేసి గ్యాలరీలో కూర్చుని ఎదురు చూశారని తెలిపారు. 84 ఓట్ల తేడాతో బిల్లును కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి ఓడించాయని ఆరోపించారు. పెద్ద ఎత్తున మహిళా సాధికారత సాధించాలనే ఉద్దేశంతో బిల్లును ప్రవేశపెట్టామని.. బిల్లును వ్యతిరేకించిన పార్టీల వైఖరిని ఎండగట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 25 ఏళ్లుగా 33 శాతం పదవులను మహిళలకు కేటాయించిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొన్ని పార్టీలు ప్రచారం చేసి బిల్లును తాత్కాలికంగా ఓడించాయని కేంద్ర మంత్రి విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. లోక్సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల వాటా పెరుగుతుందని తెలిపారు.కొన్ని పార్టీలలో కుటుంబ సభ్యులకే ప్రాధాన్యం ఇస్తూ.. సాధారణ మహిళలకు అవకాశాలు ఇవ్వడంలేదని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్