
కామారెడ్డి , 23 ఏప్రిల్ (హి.స.) ఇటీవల కురిసిన వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. వడగండ్ల వాన కారణంగా పంటలు దెబ్బతిన్న భిక్కనూరు మండల రైతులు గురువారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం జప్తి శివునూరు వద్ద ఉన్న ఫామ్ హౌస్లో ఆయనను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి బాధిత రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఇవాళ జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించి, బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి తుమ్మల సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..