
హైదరాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)
హైదరాబాద్ జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో, జర్నలిస్టు వర్గాల ప్రతినిధులు సమాచార & ప్రజాసంబంధాల శాఖ కమిషనర్ సీఎహెచ్.ప్రియాంక గారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కమిటీ ఏర్పాటులో ప్రముఖ పత్రికలు మరియు ప్రధాన మీడియా సంస్థలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, అలాగే వివిధ జర్నలిస్టు యూనియన్లు ప్రతిపాదించిన సభ్యులను పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్టులను పక్కన పెట్టి, కొత్త వ్యక్తులను నియమించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
అలాగే ఫోటో, ఉర్దూ, వీడియో, స్మాల్ అండ్ మీడియం, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్లు సూచించిన పేర్లను విస్మరించి, అనుకూల వ్యక్తులను మాత్రమే కమిటీలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, అధికారుల నుంచి స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని వెల్లడించారు. తక్షణమే కమిటీని పునర్వ్యవస్థీకరించి, ప్రధాన పత్రికలు మరియు అనుభవజ్ఞులైన జర్నలిస్టులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కమిషనర్‌ను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు