
జనగామ, 23 ఏప్రిల్ (హి.స.)
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గురువారం జనగామ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రైవేట్ వ్యక్తులతో బయలుదేరుతున్న బస్సులను ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళన చేస్తున్న ఆర్టీసీ సిబ్బందిని చెదరగొట్టి, ప్రయాణికులు సురక్షితంగా తమ ప్రయాణం కొనసాగించేలా చర్యలు చేపట్టారు. అయితే, పోలీసుల జోక్యం తర్వాత కూడా ఆర్టీసీ సిబ్బంది మళ్లీ బస్సులను అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో కొంత ఉద్రిక్తత పెరిగింది. ఈ క్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్ భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసి, ఆర్టీసీ నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని, తమ సమస్యలను అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉండగా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..