రామప్పలో లేజర్ షో..
రామప్ప దేవాలయం అత్యాధునిక త్రీడీ లేజర్ షోతో కనువిందు చేయనుంది.
Ramapa temple


వెంకటాపూర్(వరంగల్), 23 ఏప్రిల్ (హి.స.)ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయం అత్యాధునిక త్రీడీ లేజర్ షోతో కనువిందు చేయనుంది. రూ.3కోట్ల అంచనా వ్యయంతో దీని పనులు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం, రాష్ట్ర పర్యాటక శాఖ సంయుక్తంగా రామప్ప అభివృద్ధి కోసం కేటాయించిన నిధులలో భాగంగా రూ.3 కోట్లను ఈ లేజర్షో ప్రొజెక్టర్ కోసమే కేటాయించినట్లు సమాచారం.

అత్యాధునిక ప్రొజెక్టర్లు ఈషో కోసం అత్యంత శక్తిమంతమైన, హైరిజల్యూషన్ కలిగిన హైటెక్ ప్రొజెక్టర్లను ఉపయోగిస్తున్నట్లు టూరిజం అధికారులు పేర్కొన్నారు. ఇవి రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం గోడలపై, దేవాలయంపై పడేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ర్కీన్లపై త్రీడీ ఎఫెక్ట్స్ను అద్భుతంగా ప్రదర్శించనున్నట్టు తెలిపారు.

కాకతీయ సామ్రాజ్య వైభవం, రామప్ప శిల్పి చాతుర్యం, ఈ ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన తేలే ఇటుకల సాంకేతికతను పర్యాటకులకు అర్థమయ్యేలా దృశ్య రూపంలో చూపిస్తారు. ప్రొజెక్టర్ల వ్యవస్థాపన, సౌండ్ సిస్టం సెటప్, పర్యాటకులు కూర్చునే గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయనున్నారు. మరో నెల రోజుల్లో ఈ త్రీడీ లేజర్షో, సౌండ్ సిస్టమ్స్ రామప్పలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మకంగా లేజర్ ప్రదర్శనలు నిర్వహించారు.

త్వరలోనే దీనిని పూర్తిస్థాయిలో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని వారిని రాత్రి వేళల్లో కూడా ఆకట్టుకోవడానికి ఈ మల్టీ మీడియా షోను ప్రధాన ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. పర్యాటక శాఖ అధికారికంగా ప్రారంభ తేదీని ప్రకటించిన తర్వాత ఈ ప్రదర్శన ప్రతిరోజు నిర్ణీత సమయాల్లో అందుబాటులో ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande