
ఆదిలాబాద్, 23 ఏప్రిల్ (హి.స.)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రవాణా రంగం అతలాకుతలమైంది. ఆరు డిపోల పరిధిలో బస్సులు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పీఆర్సీ అమలు, ఉద్యోగ భద్రత వంటి 32 డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా సమ్మె కొనసాగుతోంది. డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. సమ్మె పై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చర్చలు సఫలమైతే తప్ప బస్సులు రోడ్డెక్కే అవకాశం లేదని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కాగా, బస్సులు లేకపోవడంతో ఆటోలు, ప్రైవేట్ వాహనదారులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 డిపోల్లోని 1,946 మంది ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పెండింగ్ జీతాలు, ఉద్యోగ భద్రత, పీఆర్సీ అమలుతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ కార్మికులు గళమెత్తారు. జేఏసీ పిలుపుతో సీనియర్ ఉద్యోగుల నుంచి మహిళా సిబ్బంది వరకు అంతా ఏకమై సమ్మెలో పాల్గొనడంతో ఆందోళన తీవ్రరూపం దాల్చింది. పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె కారణంగా 641 బస్సులు డిపోలకే పరిమితమవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, మారుమూల చేరుకోవడానికి గ్రామాల ప్రజలు పట్టణాలకు అవస్థలు పడుతున్నారు.
అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారు కూడా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడక తప్పడం లేదు.
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్, భైంసా డిపోల వద్ద ఉదయం నుంచే కార్మికులు బైఠాయించారు. డిపో గేట్ల ఎదుట ధర్నాలు చేస్తూ బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు తెలపడంతో నిరసనల ఉధృతి పెరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 32 రకాల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు డిపోల వద్ద భారీగా మోహరించి పర్యవేక్షిస్తున్నారు.సమ్మె పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని జేఏసీ హెచ్చరిస్తోంది. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో మార్కెట్ కార్యకలాపాలు కూడా దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు